గుండె ఊసులు...

అదేమిటో గుండెకు ఆయుష్షు అవగానే మన ఆయుష్షు తీరిపోతుంది, అలాగే మన ఆయుష్షు తీరగానే గుండెకు ఆయుష్షు ఉన్నా అదీ ఆగిపోతుంది-దానికింకా ఆయుష్షు ఉన్నాకూడా; అంటే మనం చిరంజీవులం కాకపోయినా మన గుండె చిరంజీవి అన్నమాట!

అందుకనే కదా ఆయుష్షు తీరిన మనిషి గుండె- గుండె మార్పిడి జరిగినప్పుడు ఇంకొకళ్ల ఒంట్లోకి వెళ్లి కొట్టుకుంటూనే ఉంటుంది.ఇదేదో సైంటిఫిక్ జర్నల్ చదివి తెలుసుకోవాల్సిన విషయమే కాదు- ఇంగిత జ్ఞానానికి సంబందించిన విషయం ఇంగిత జ్ఞానం అంటే తిట్టేమీ కాదు-ఇందులో “జ్ఞానం” అనే పదం వచ్చింది కాబట్టి పెద్దజ్ఞానికి మాత్రమే ఉండేది కాదు, ప్రతి మనిషికి ఉండాల్సింది, కొంతమందికి ఉండనిది- ఇంగ్లీష్ లో “కామన్ సెన్స్” అంటారే- అదన్నమాట!

ఇంకో విషయంకూడా- మనం ఎక్కువ సమయం జీవితంలో సంతోషంగా ఉంటూ,ఇతరులకి కూడా సంతోషాన్ని కలిగిస్తుంటే-మన గుండె ఉబ్బితతబ్బిబ్బు అవుతుంది-దాని ఆయుష్షులోంచి ఇంకొద్దిగా ఆయుష్షు మనకి ఇస్తుంది-ఎంతైనా మన గుండేకదా-మనతో ఎక్కువకాలం ఉండాలనే తపన దానికీ ఉంటుంది మరి!

హృదయం అనేది మనం బతకడానికే కాదు; ఇతరులకి ఆనందం పంచడానికి (డబ్బులతోనే కాదు-మన హృదయంతో కూడా ఆనందించవచ్చు, ఉచితంగా ఇతరులను ఆనందింప చేయవచ్చు) అవతలవాళ్ళని బతికించడానికి, ఆ హృదయంతో చేయూతనివ్వటానికి కూడా!

కొంతమంది ఉంటారు - గుండె చేసే మేలేమిటో కూడా తెలియకుండా వ్యవహరిస్తారు సమాజంలో-ఇల్లాంటివాళ్ళకి అసలు హృదయం ఎందుకు- ఓ కృత్రిమ హృదయం- అదికూడా “పోర్టబుల్, డిటాచబుల్”- శాస్త్రజ్ఞులు కనిపెడితే ఎంచక్కా జనం ఏ గొడవా లేకుండా బతికేస్తారు.గుండె పోటు రావడం, గుండె ఆగిపోవడం అంటూ ఉండదు; హృదయంతో పనేలేదు, బతికేది ఎలాగూ యాంత్రికంగానే ఈ యాంత్రికయుగంలో! ఇలాంటివాళ్ల సంగతి పక్కన పెడితే- ఏతావాతా తేలేదేమిటంటే గుండెని జాగ్రత్తగా చూసుకుంటూ-సంతోషంగా ఉంటే మన ఆయుష్షు-మరింత ఎక్కువగా కాకపోయినా,ఇంకొద్ది ఎక్కువగా పెరుగుతుంది.అందుకనే గుండెలు మార్చే వైద్యులు కూడా “మీ గుండెని జాగ్రత్తగా చూసుకోండేం” అని చెప్తుంటారు!

ఏమిటో గుండె ఉండబట్టలేక మీగుండెని జాగ్రత్తగా చూసుకోమని రాయడంగానీ, మీకు మాత్రం తెలియదా మీగుండెని బాగా చూసుకోవాలని!!

ఏమిటో- గుండె గురించి రాస్తుంటే నాగుండెలో ఈ కింది పాట అప్రయత్నంగా మోగింది... “ఈ నల్లని రాళ్ళలో ఏ కన్నులు దాగెనో- ఈ బండల మాటున ఏ గుండెలు మ్రోగెనో”

అమరశిల్పి జక్కన్న చిత్రానికి,సి నారాయణ రెడ్డి సాహిత్యానికి - సాలూరివారి రసాలూరు సంగీతం తోడయ్యింది; దీనికి ఘంటసాల తన గాత్రంతో ప్రాణం పోశారు.

అక్కినేని వీరందరి ప్రతిభకి జీవం పోశారు-బి.సరోజా దేవి దగ్గరుండగా మరి అక్కినేని జీవించరా!!

https://www.youtube.com/watch?v=WGkK97H3Oc0

తీరుబడి ఉంటే ఆ బండల మాటున దాగిన చప్పుళ్ళు మీ గుండెకి వినిపించండి-అదీ ఆనందిస్తుంది మీతోబాటుగా!

divider

Share your thoughts with Author!!

Spread the words out!!!